అమ్రాబాద్, వెలుగు: వానాకాలం సాగులో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, పెట్టుబడి ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా పదర గ్రామంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సు ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల సమన్వయంతో ఆరు వారాల పాటు సాగిన ఈ సదస్సుల్లో ప్రధానంగా యూరియా వాడకం తగ్గించడం, రసాయనాల వినియోగంపై నియంత్రణ, భూసార రక్షణ, విత్తనాల రశీదుల భద్రత, పంట మార్పిడి లాంటి అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. సాగునీటిని పొదుపుగా వాడుతూ, ప్రత్యామ్నాయ పంటల ద్వారా లాభాలు గడించాలని, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ ప్రొఫెసర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
